EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జేసిఎస్ ప్రసాద్ త్యాగం.. భారత "విప్లవోద్యమంలో చెరగని ముద్ర." - ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు.

    Author admin | 14 Nov 2026, 08:33 PM | TELANGANA
    జేసిఎస్ ప్రసాద్ త్యాగం.. భారత "విప్లవోద్యమంలో చెరగని ముద్ర."  - ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: భారత విప్లవోద్యమంలో జార్జిరెడ్డి అడుగుజాడల్లో నడిచిన, పిడిఎస్ యు నిర్మాత జంపాలా చంద్రశేఖర ప్రసాద్ చేసిన త్యాగం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోతుందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు అన్నారు. జంపాలా చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ గ్రంథాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో జంపాలా చంద్రశేఖర ప్రసాద్ స్మారకోపన్యాస సభను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన డి. పాపారావు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్ లోని ఎత్తోండ గ్రామానికి చెందిన జంపాలా చంద్రశేఖర ప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పిడిఎస్ యు విద్యార్థి సంఘంను స్థాపించి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, ప్రజా సమస్యలపై పోరు బాటలు వేశాడనీ అన్నారు.

    1975లో దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థి, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తున్న సమయంలో జేసీఎస్ ప్రసాద్‌తో పాటు నీలం రామచంద్రయ్యను పోలీసులు ముందుగా విజయవాడలో అరెస్టు చేశారన్నారు. అరెస్టు అనంతరం వారిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు– కొత్తగూడెం ప్రధాన రహదారి సమీపంలోని బొజ్జయిగూడెం (చీకటిగండ్ల అడవి) ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని అన్నారు. కానీ జంపాలా చంద్రశేఖర్ ప్రసాద్ మరణించి 50 ఏళ్లు దాటినప్పటికీ ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటికీ సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు.

    జేసిఎస్ ప్రసాద్ త్యాగం.. భారత "విప్లవోద్యమంలో చెరగని ముద్ర."  - ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు. - Additional Image

    గత ఐదు దశాబ్దాల కాలంలో ఆయన వేసిన బాటలోనే ఎన్నో ఉద్యమాలు సాగాయని, ఈ పోరాటాల్లో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం విప్లవానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ విప్లవ శక్తులు మాత్రం డోలాయమాన స్థితిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

    ఇవి కూడా చదవండి

    ప్రభుత్వాలు రాయితీల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహం అందిస్తున్నాయని విమర్శించారు. గత 40 ఏళ్లలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతుండగా, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు కొన్ని దేశాలు ఈజీ మనీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు.

    కృత్రిమ మేధస్సు (ఏఐ)ను సైతం పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని, దీని ప్రభావంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని, 50 ఏళ్ల క్రితం ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులే నేడు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. దోపిడీ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రజలు సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంపాలా చంద్రశేఖర ప్రసాద్ గ్రంథాలయ ట్రస్టీ ఆకుల పాపయ్య, ట్రస్ట్ సభ్యులు బైస రాందాస్, వనమాల కృష్ణ, పరుచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి