🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 20 Nov, 2026 | Page: 1

పెర్కిట్‌లో అంగరంగ వైభవంగా... "నాయకపోడ్ శ్రీశ్రీ భీమన్న" ఉత్సవ దర్బార్.నాయకపోడ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల హామీ.


- ఐదవ మహాసభకు పోటెత్తిన ఆదివాసీ నాయకపోడ్ ప్రజలు.. 8 వేల మందితో జనసంద్రంగా మారిన పెర్కిట్.

వేగుచుక్క న్యూస్,
ఆర్మూర్, నవంబర్ 20: ఆదివాసీ నాయకపోడ్ సమాజ ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్, ఐదవ మహాసభ పెర్కిట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నాయకపోడ్ సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని శ్రీశ్రీ భీమన్న దేవాలయం వద్ద ఈ మహాసభను ఘనంగా నిర్వహించారు.

ఈ మహాసభకు నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8 వేల మంది ఆదివాసీ నాయకపోడ్ సోదర సోదరీమణులు తరలివచ్చారు. దీంతో పెర్కిట్ ప్రాంతం జనసంద్రంగా మారింది. సంప్రదాయ ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ జరిగిన ఈ వేడుక నాయకపోడ్ సమాజ ఐక్యతను చాటిచెప్పింది.

*మహాసభకు ప్రముఖుల హాజరు.*
*
నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ అధ్యక్షతన, జిల్లా గౌరవాధ్యక్షుడు బండారి భోజన్న మార్గదర్శకత్వంలో మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మాణిక్య రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పి. వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేసినేని రాజన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి శంకర్, తెలంగాణ సచివాలయం అడిషనల్ ఎస్పీ పుట్ట దేవిదాస్, జైలర్ కూన ఆనందరావు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఇసరపు రవి, జిల్లా, మండల స్థాయి నాయకులు, ఉద్యోగులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*నాయకపోడ్ సమస్యల పరిష్కారానికి వినతి*

మహాసభ సందర్భంగా నాయకపోడ్ సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంఘ నాయకులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన కుటుంబాలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, మారుపేర్లు, ఇంటిపేర్ల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం, విద్యార్థులకు గురుకులాలు, మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు, ఉన్నత విద్యలో సమస్యలు, ఉద్యోగ నియామకాల సమయంలో సర్టిఫికెట్ల పరిశీలనలో జాప్యం, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు, మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి, నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను వివరించారు.

ఈ సమస్యలపై స్పందించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు నాయకపోడ్ సమాజ సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు.

*సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పిలుపు*
*
నాయకపోడ్ తెగ పూర్వీకుల చరిత్ర, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ఆరాధనా విధానాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. లక్ష్మీదేవర, కొర్రాజులు, గట్టమ్మ తల్లి, గాంధారి ఖిల్లా, మైసమ్మ తల్లి, శ్రీశ్రీ భీమన్న తదితర దైవాలను తరతరాలుగా ఆరాధిస్తూ వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్తీక మాసంలో నిర్వహించే భీమన్న ఉత్సవాలు ఆధ్యాత్మికతతో పాటు సమాజ ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు.

*1974 నుంచి ఐదు దశాబ్దాలుగా సేవలు*

కీర్తిశేషులు మద్ది రామచందర్ ఆధ్వర్యంలో 1974లో ప్రారంభమైన నాయకపోడ్ సేవా సంఘం ఐదు దశాబ్దాలుగా సమాజ హక్కుల సాధన, విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తోందని సంఘ నాయకులు తెలిపారు. సంఘ అభివృద్ధికి కృషి చేసిన పూర్వ నాయకుల సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలోని ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
🏠 Home