🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 20 Nov, 2026 | Page: 1

మెతుకు దొరకని దీనస్థితి నుంచి... మెజిస్ట్రేట్ గా "తలారి బాలయ్య".నాంపల్లి కోర్టు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియామకం.


- పేదరికాన్ని జయించి న్యాయరంగంలో ఉన్నత శిఖరాలకు..

- చిన్ననాటి కష్టాలను అధిగమించి తుజాల్ పూర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచిన విజయ ప్రస్తానం.

" సంకల్పం బలంగా ఉంటే పేదరికం కూడా విజయానికి అడ్డుకాదని నిరూపించారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది తలారి బాలయ్య. మెతుకు దొరకని దీనస్థితి నుంచి... మెజిస్ట్రేట్ గా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శం.
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల మధ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదువును కొనసాగించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి న్యాయరంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘ న్యాయవాద అనుభవం, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అందించిన సేవలను గుర్తించిన తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆయనను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియమించాయి. ఒక సామాన్య గ్రామీణ కుటుంబం నుంచి న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన బాలయ్య ప్రస్థానం ఇప్పుడు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది."

*వేగుచుక్క న్యూస్, ప్రతినిధి కుంచె వెంకటేష్*

కామారెడ్డి జిల్లా
తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన దివంగత తలారి పోచమ్మ, వెంకయ్య దంపతులకు ఐదవ, చివరి సంతానంగా తలారి బాలయ్య జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. వేసవి, పండుగ సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదువుకు అవసరమైన ఖర్చులను సమకూర్చుకున్నారు.

తొమ్మిదో తరగతి వరకు సిద్దిపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదివిన ఆయన, 1987–88లో బీబీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1995–98 మధ్య ఎల్‌ఎల్‌బీ, 1999–2001లో లేబర్ లా స్పెషలైజేషన్‌తో ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు.

*1999 నుంచి న్యాయవాదిగా ప్రస్థానం..*

1999 ఏప్రిల్ 7న అప్పటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న బాలయ్య అప్పటి నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. సివిల్, క్రిమినల్ తదితర కేసుల్లో వాదనలు వినిపిస్తూ, న్యాయశాస్త్రంపై పట్టుతో, బాధితులకు న్యాయం అందించాలనే తపనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేసుల అధ్యయనం, న్యాయపరమైన అంశాల విశ్లేషణలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సీనియర్ న్యాయవాదిగా ఎదిగారు.

*అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలు..*

న్యాయరంగంలో ఆయన అనుభవాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 3న రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్‌బీ నగర్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 2018 నుంచి 2022 వరకు ప్రభుత్వ తరఫున పలు క్రిమినల్ కేసులను సమర్థవంతంగా నిర్వహించారు. సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం, సాక్షుల వాంగ్మూలాలు, బాధితులకు న్యాయం జరిగేలా న్యాయపరమైన వాదనలు వినిపించడం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. ఆయన నిర్వహించిన పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు విధించబడటం విశేషం.

*పోలీసు శాఖ నుంచి ప్రశంసలు..*

పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అందించిన సేవలకు గుర్తింపుగా అప్పటి రాచకొండ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న మహేష్ భగవత్, అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ చేతుల మీదుగా పలు అవార్డులు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు. న్యాయ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.

*నాంపల్లి కోర్టులో కీలక బాధ్యతలు..*

దాదాపు 28 ఏళ్లకు పైగా న్యాయరంగంలో అనుభవం కలిగిన తలారి బాలయ్యను తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియమించాయి. ఈ నియామకం ఆయన వృత్తిపరమైన ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. నూతన బాధ్యతల్లోనూ నిష్పాక్షికత, చట్టబద్ధత, న్యాయ విలువలకు ప్రాధాన్యమిస్తూ సేవలందిస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*నియామకంపై గ్రామంలో హర్షం..*
*
తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి న్యాయవ్యవస్థలో ఉన్నత బాధ్యతలు చేపట్టడం పట్ల గ్రామస్థులు, కామారెడ్డి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ఈ స్థాయికి చేరుకోవడం గ్రామీణ యువతకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

*హైకోర్టు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు..*

తనను స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియమించిన తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తలారి బాలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎదుగుదలకు సహకరించిన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, న్యాయవాద సహచరులు, న్యాయశాఖ, పోలీసు శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన బాధ్యతలను చట్టబద్ధత, నిష్పాక్షికతతో సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

"కూలీ పనులు చేస్తూ చదువుకున్న బాలుడి నుంచి న్యాయస్థానంలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన తలారి బాలయ్య జీవన ప్రస్థానం.. కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా లక్ష్యం వైపు సాగితే విజయం తప్పక వరిస్తుందనీ బాలయ్య నిరూపించాడు. "
🏠 Home