రేవంత్ రెడ్డి రెండు నెలలు టైం ఇస్తున్నాం.. * రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందే.ఏఐకేఎస్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్.
* లేకుంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మందితో పాదయాత్ర చేపడతాం.
- రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలం
- ఏఐకేఎస్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్.
వేగుచుక్క న్యూస్, నల్గొండ: తెలంగాణలోని రైతులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, రైతుల సమస్యలను రెండు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలనీ, లేదంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మంది రైతులతో మహాపాదయాత్ర చేపడతామని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ ప్రకటించారు. ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభను పురస్కరించుకొని నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రతినిధులకు, రైతులకు, ప్రజలకు, అభివందనాలు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, సామినేని రామారావు, పలువురు అమరవీరులకు జోహార్లు అర్పించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు అందిస్తాం, సాగునీరు, పంట నష్టపరిహారం, తదితర హామీలను నెరవేరుస్తాం అని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలల్లో వాటన్నిటిని విస్మరించారని విమర్శించారు. తెలంగాణలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుందా? అని ప్రశ్నించారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, తదితర దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ రైతాంగానికి ప్రమాదకరమని హెచ్చరించారు. దేశంలో రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. క్విట్ ఇండియా ఇచ్చిన డూ ఆర్ డై నినాదంతో రైతులు జీవనస్మరణ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద కాంక్షతో ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తున్న, దాడులు చేస్తున్న ట్రంప్ విధానాలకు ఘోరీ కడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి....అనే పాట పాడి సభికుల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. పాలకుల బెదిరింపులకు భయపడకుండా జెన్జీ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం యువకులు, ఆదివాసులు, రైతులు, ప్రజలు ఐక్యంగా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.