మధుమేహంపై అవగాహనతోనే... "ఆరోగ్యకరమైన జీవనం." - ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో డయాబెటిస్ వాక్.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: మధుమేహ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం సూచించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం నిజామాబాద్ రీజియన్ లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో డయాబెటిస్ వాక్ నిర్వహించారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ఈవాక్ హైదరాబాద్ రోడ్, పూలాంగ్ మీదుగా వినాయకనగర్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇరుకుల వీరేశం మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ వాకింగ్, యోగా, వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. మధుమేహ నివారణ, నియంత్రణపై అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్‌లు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, అందులో భాగంగానే డయాబెటిస్ వాక్ చేపట్టినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ నిజామాబాద్ రీజియన్ చైర్మన్ పుల్గం హన్మాండ్లు, జిల్లా చైర్మన్లు డి. యాదగిరి, ద్వారకాదాస్ అగర్వాల్, సూర్యభగవాన్, శంకర్, నర్సింహరావు, రమేష్, జోన్ చైర్మన్లు అబ్బాయి లింబాద్రి, హీరమల్ల విష్ణు, రీజియన్ కార్యదర్శి గజ్జెల నాగేశ్వరరావు, రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.