🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 04 Nov, 2026 | Page: 1

చెత్త కుప్పల్లో కూర్చొని "కౌన్సిలర్ నిరసన". - కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం!

- పట్టించుకోని అధికారులకు వినూత్న నిరసనతో షాక్..

- పట్టణాన్ని డంపింగ్ యార్డుగా మార్చారంటూ మండిపాటు.

వేగుచుక్క న్యూస్: కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన 46వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తన వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పల్లోనే కూర్చొని మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణాన్ని మున్సిపల్ కమిషనర్ డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని మండిపడ్డారు. చెత్త సమస్యపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు.

పట్టణంలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలోని అన్ని వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

కౌన్సిలర్ నిరసన నేపథ్యంలో స్పందించిన మున్సిపల్ సిబ్బంది సుభాష్ రోడ్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అయితే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సమీపంలో మాత్రం చెత్త కుప్పలు అలాగే ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట చెత్త తొలగించి మరోచోట వదిలేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణవ్యాప్తంగా పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
🏠 Home