ఓయూ , హైదరాబాద్ :యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను పెంచాలి..నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్. మూర్తి.
- అన్ని విశ్వవిద్యాలయాల్లో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి.
- ఓయూ లో నిరసన కార్యక్రమం.
వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను పెంచాలనీ, అన్ని విశ్వవిద్యాలయాల్లో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలనీ
నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్. మూర్తి డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరుద్యోగ జేఏసీ, ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సంతకాల సేకరణతో కూడిన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆర్.ఎల్. మూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్టు అధ్యాపకులను మినహాయించిన చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఆర్ధిక శాఖ వెయ్యి పోస్టులు పైగా అనుమతి ఇచ్చిందని, వాటన్నింటినీ కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభాగాల వారీగా కేటాయించిన పోస్టుల్లోనూ శాస్త్రీయత, పారదర్శకత లోపించాయని పేర్కొన్నారు. ఖాళీలు కూడా అసంబద్ధంగా ఇచ్చారాని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టకుండా కేవలం ఏడు యూనివర్సిటీలకే ఆర్థిక శాఖ ఆమోదం పరిమితం చేయడం సరైంది కాదన్నారు. మిగిలిన యూనివర్సిటీల్లో, మిగతా ఖాళీలను మరో విడతలో నియామకాలు చేపడతామని చెప్పడం సరైంది కాదని అన్నారు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను గుర్తించి, ఒకేసారి సమగ్ర నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 31లో వెయిటేజీ ఇవ్వడం అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించే సూత్రానికి విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉండగా, 10 నుంచి 20 సంవత్సరాల క్రితం డిగ్రీ, చదువులు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రస్తుత విద్యార్థులతో పోలిస్తే తక్కువ మార్కులు ఉండే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల మార్కుల వెయిటేజీని మార్చాలని యూజీసీ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని కోరారు. రోస్టర్ రిజర్వేషన్ల అమలులో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఎలాంటి నష్టం జరగకుండా న్యాయబద్ధంగా నియామకాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీలను పెంచాలని, స్థానిక విద్యార్థులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని అన్నారు.
యూనివర్సిటీ నియామకాల్లో రాజకీయ జోక్యానికి, తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే బోధనా సిబ్బంది కొరతను పరిష్కరించడంతో పాటు, అన్ని విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమించడం అత్యవసరమని పేర్కొన్నారు.
*రూ.1,000 కోట్ల నిధుల విడుదలలో జాప్యం..*
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను ఇప్పటివరకు విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,000 కోట్లను విడుదల చేసి, యూనివర్సిటీ అభివృద్ధి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల అభివృద్ధి, ఉన్నత విద్య నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డాక్టర్ ఆర్.ఎల్. మూర్తి కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను పెంచి, అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేసే వరకు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి అజయ్ ఉపాధ్యక్షులు మంచాల కిరణ్ కుమార్, నాయకులు రాజు, అశ్విని, హర్ష వర్ధన్,నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆంజనేయులు, కిరణ్, ప్రకాష్ ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు ఉదయ్, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల బద్రి, ఎస్ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు నవీన్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, పరిశోధక విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ మాజీ కార్యదర్శి క్రాంతి వినోద్, నవీన్, క్రాంతి, సోమేశ్వర్, విజయ్, రాహుల్ విద్యార్థులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ మద్దతును తెలియజేశారు.