ఓ తల్లి దుఃఖ గీతం.. - నేరెళ్ల బాధిత కుటుంబం పడుతున్న వేదన లోంచి..
- క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక కథనం..
*వేగుచుక్క న్యూస్:* సిరిసిల్ల అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారాలు వేరు.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కుదిపేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటన గురించి తెలియని వారు ఉండరు. అయితే విస్మరించబడిన ఓ బాధిత కుటుంబానికి సహాయం కూడా అందని పరిస్థితి. ఓ తల్లి పడుతున్న దుఃఖం కలచివేస్తుంటె నేరెళ్ల బాధిత కుటుంబంలో ఓ తల్లి పడుతున్న దుఃఖ గీతమే కథనం. నేరెళ్ల ఇసుక లారీల కు బలైన మొదటి రైతు గంధం మల్లేశం . గంధం మల్లేశం కుటుంబం ఇసుక లారీల వేటుకు చిన్నాభిన్నమైంది. గంధం మల్లేశం భార్య భాగ్యమ్మ ఇప్పటికీ కన్నీళ్లను మోస్తూనే దైన్యస్థితిలో మిగిలింది. నేరెళ్ల గ్రామం నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం..
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నేరెళ్ల ఘటనలో ఇసుక లారీలను దగ్ధం చేశారనే నెపంతో నేరెళ్ల గ్రామ యువకులను చిత్రహింసలకు గురిచేసిన ఘటనను సమాజమంతా తప్పుపట్టింది. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వం పోయి.. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన పరిస్థితి ఉందంటే నేరెళ్ల బాధితుల కన్నీటి వ్యధలు అర్థం చేసుకోవచ్చు.
26-5-2017న జరిగిన గంధం మల్లేశం ఘటన వెనుక కూలిపోయిన ఎన్నో జీవితాలు ఉన్నాయి. ప్రపంచం చూడకుండా మిగిలిపోయిన ఓ తల్లి దుఃఖం ఇంకా తడి తడి గానే ఉంది. నేరెళ్ల ఘటన జరిగి దశాబ్ద కాలానికి చేరువలో ఉన్నాం. అయితే నేరెళ్ల ఘటనకు ప్రజల్లో ఆందోళనకు కారణమైన పరిస్థితులు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. 25-5-2017న గంధం మల్లేశం అనే వ్యవసాయ కూలీని నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీ ఢీకొనడంతో మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం రోజుల వ్యవధిలోనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తుల ఆగ్రహానికి కారణమైంది.
కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో మల్లేశం భార్య భాగ్యమ్మపై కుటుంబ భారం పడింది. అప్పటి నుంచి భాగ్యమ్మ జీవితంలో దుఃఖపు తెరలు అలుముకున్నాయి.
కాలం ఎవరి కోసం ఇక్కడ ఆగదు కదా.ఆ బాధిత కుటుంబం గురించి ఎవరికి పట్టని దయనీయ పరిస్థితి.
ఎవరికి చెప్పుకోలేని స్థితిలో భాగ్యమ్మ కుటుంబం మిగిలింది. ఇప్పటికీ భాగ్యమ్మ వ్యవసాయ కూలీగానే పనిచేస్తుంది. అనారోగ్యం వెంటాడుతున్నా.. కన్నీళ్ల మధ్య జీవితాన్ని నెట్టుకొస్తుంది.ఇద్దరు కుమారుల్లో ఒకరు ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టగా.. మరొకరు ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. ఆరోజు తండ్రికి జరిగిన ప్రమాద వార్త విన్న క్రమంలో ఆ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆ గాయం తాలూకు ప్రభావం తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు. నిస్సహాయ స్థితిలో ఓ తల్లి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.
ఇంకా గతంలోకి వెళ్లి గమనిస్తే..
బాధిత కుటుంబాన్ని అప్పట్లో గుర్తించింది ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అని భాగ్యమ్మ కన్నీళ్లతో తెలిపింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఆనాటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడితో కలిసి పరామర్శించినట్లు భాగ్యమ్మ తెలిపింది.దురదృష్టం ఏమిటంటే.. ఇప్పటికీ భాగ్యమ్మ కుటుంబాన్ని బాధిత కుటుంబంగా పరిగణించకపోవడం విచారకరం. ముఖ్యమంత్రి నేరెళ్ల బాధితుల ఘటనపై చలించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఇసుక లారీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన గంధం మల్లేశం కుటుంబాన్ని మాత్రం గుర్తించలేదని భాగ్యమ్మ ఆవేదనతో కన్నీటి పర్యంతరం అవుతూ తెలిపింది.తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. తమ కుటుంబానికి దుఃఖమే మిగిలిందని భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు. చిన్నాభిన్నమైన భాగ్యమ్మ జీవిత దుఃఖగీతం వింటుంటే కన్నీళ్లు ఆగవు. సాటి మనిషిగా తమను గుర్తించి.. కనీస సహాయమైనా అందించాలని భాగ్యమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇది ఒక నేరెళ్ల బాధింత కుటుంబం కథ మాత్రమే కాదు. భర్తను పోగొట్టుకుని బిడ్డల్ని జీవితాలను సవరించలేక ఓ తల్లి దుఃఖ గీతం. కాసింత ఆసరా కోసం ఎదురుచూపు..
✍️ అల్లే రమేష్ సిరిసిల్ల.