అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.
నిజామాబాద్, ఆగస్టు 25:
ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.
నిజామాబాద్‌లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేద చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.
లబ్ధిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయాలని ఫౌండేషన్‌కు సూచించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రజలు సమష్టిగా పనిచేస్తే అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరుతాయని అన్నారు.
ఈ సందర్భంగా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ధర్మపురి అరవింద్‌ను గవర్నర్ అభినందించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను వివరించారు. పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పి. రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.