🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 28 Jul, 2026 | Page: 1

కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్. - నిజామాబాద్ పార్లమెంట్ పరిధి రైల్వే ప్రాజెక్టులపై వినతి.


వేగుచుక్క న్యూస్, డిల్లీ:
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని, అలాగే డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గడంతో పాటు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించబడి ప్రయాణ భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ వివరించారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ఇటీవల ఇందల్వాయి మరియు జానకంపేట వద్ద నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత మరియు రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు.
🏠 Home