ఖాకీ "బలగం"... - సమాజానికి ఆదర్శంగా.. 2014 బ్యాచ్ ఎస్ఐలు. - రక్త బంధం కంటే స్నేహ బంధం గొప్పదని చాటుతున్నారు.. - మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి రూ.25 లక్షలు అందించిన సహచరులు.
*"కాకి బలగం అనే సామెతను నిజం చేస్తూ... ఖాకీలు తమ సహచరుని కుటుంబానికి అండగా నిలబడి, నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రక్త బంధం కంటే తమ స్నేహ బంధం గొప్పదని చాటుతున్నారు.. 2014 బ్యాచ్ కు చెందిన ఎస్ఐలు. తమ బ్యాచ్ మేట్ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతూ ఇటీవల మృతి చెందిన ఎస్ఐ వెంకటనారాయణ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు."*
*వేగుచుక్క న్యూస్:*
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన జి. వెంకటనారాయణ 2014లో సన్ఇన్పెక్టర్గా ఎంపికై, కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఈ ఏడాది మే 19న కన్నుమూశారు. ఆయన మరణంతో భార్య, ఇద్దరు కుమారులు, వృద్ధ తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో 2014 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 బ్యాచ్ కు చెందిన 746 మంది ఎస్ ఐలు కలిసి రూ.25 లక్షలు సమీకరించారు. ఆదివారం బేతవోలు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుడి ఇద్దరు కుమారులకు చెరో రూ.10 లక్షలు, వృద్ధ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి 2014 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు టి. శ్రీధర్ అధ్యక్షత వహించగా, రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది ఎస్ఐలు హాజరై వెంకటనారాయణ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎస్ఐలు శ్రీకాంత్ గౌడ్, సుధాకర్, అశోక్ రెడ్డి, రామకృష్ణ, కోటేష్, నరేష్, ప్రవీణ్ కుమార్, నవీన్, ఇరుగురవి, మహేందర్లాల్, దేవేందర్ తదితరులు పాల్గొన్నాడు. వృత్తి బంధానికి మానవత్వం జతచేస్తూ, సహోద్యోగి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన 2014 బ్యాచ్ ఎస్ఐల సేవాభావం పలువురి ప్రశంసలను అందుకుంది.