🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 11 Jul, 2026 | Page: 1

నిజామాబాద్ జిల్లా: రెంజల్ "మోడల్ స్కూల్ "లో అవినీతి. - ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ డిమాండ్.

వేగుచుక్క న్యూస్: నిజామాబాదు జిల్లా రెంజల్ మండలంలోని మోడల్ స్కూల్‌లో జరుగుతున్న భారీ కుంభకోణం, ప్రిన్సిపాల్ ఫిరోజ్ అక్రమాలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్‌లో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌ను పూర్తిగా విధుల నుండి తక్షణమే తొలగించాలని వారు ఏబీవీపీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎబివిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ మాట్లాడారు. రెంజల్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ అండతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారితో ప్రిన్సిపాల్ కుమ్మక్కై, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనీ అన్నారు. విద్యార్థుల అటెండెన్స్‌ను ఉదయాన్నే మార్పులు చేస్తూ రెండు వేర్వేరు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారనీ పేర్కొన్నారు. అంతేకాకుండా, స్కూల్ ఉపాధ్యాయుల సంతకాలను సైతం ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతున్నారనీ అన్నారు.

*నిధుల దారిమళ్లింపు:*

ఒకేషనల్ కోర్సుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లించి, వేరే ఒక వ్యక్తి అకౌంట్ ద్వారా ఆ డబ్బులను డ్రా చేసుకొని భారీ అవినీతికి తెరలేపారన్నారు. పాఠశాల ప్రాంగణంలో పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేతకు పాల్పడ్డారనీ, ఈ దారుణమైన అక్రమాలకు సంబంధించి, ఉపాధ్యాయుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు స్వయంగా ప్రిన్సిపాల్ (ఫిరోజ్) ఒప్పుకున్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత విచారకరం అని అన్నారు.
కాగా ప్రిన్సిపాల్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించినట్లు తెలుస్తోందన్నారు. విచారణ అధికారుల ముందు తమకు అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వాలని ప్రిన్సిపాల్ అక్కడి ఉపాధ్యాయులను, సిబ్బందిని బెదిరించడం మరియు ఒత్తిడి తీసుకురావడం ఆయన తప్పులను స్పష్టం చేస్తోందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం మరియు విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలనీ, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రిన్సిపాల్ ఫిరోజ్‌ను తక్షణమే విధుల నుండి పూర్తిగా తొలగించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రక్షిత్, చెర్రీ దీపాన్, సాయి, క్షేహిత్, శ్రీసాయి, శివ, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home