గల్ఫ్ దేశంలో "మెకానికల్ ఇంజనీర్" అనుమానస్పద మృతి. - అవసరం కోసం పిలిచి హతమార్చారా ?
- మూడు నెలల మిస్టరీకి తెర.
- పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసిన కువైట్ పోలీసులు.
- అదుపులో నిందితుడు.. మరొకరు పరారీలో...
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన మెకానికల్ ఇంజనీర్ మూడు నెలలుగా కనిపించకుండా పోయి, చివరకు అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. అవసరం కోసం పిలిచిన తెలిసిన వారే హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనకు సంబంధించి కువైట్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామా బాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్ పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాశ్ (29) మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 2021లో కువైట్ కు వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో సీనియర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మార్చి 19న డిచ్పల్లి మండల పరిధిలోని మేలయతండాకు చెందిన గణేశ్.. కైలాశ్ వద్దకు వెళ్లి వాహనం రిపేర్ చేయాలని తీసుకెళ్లాడు. కైలాశ్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అక్కడే ఉన్న అతడి పెదనాన్న కుమారులు గణేశ్ ను కలిసి వివరాలు అడిగారు. వాహనం రిపేర్ కాకపోవడంతో కైలాశ్ ను తీసుకొచ్చి రూమ్ కు కొద్దిదూరంలో దింపి వెళ్లినట్లు అతడు సమాధానం ఇచ్చాడు. కైలాశ్ ఆచూకీ లభించకపోవడంతో వారు కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు వెళ్లడం, తిరిగి వచ్చేట ప్పుడు కేవలం ఒకరు మాత్రమే రావడం గమనించారు. నిందితుల్లో ఒకరైన కార్తీక్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. క్రేన్ ప్రమాదంలో కైలాశ్ చనిపోయాడని, పోలీసు కేసు భయంతో తాను, తన తండ్రి కలిసి శవాన్ని అక్కడే ఇసుకలో పాతిపెట్టామని చెప్పాడు.
*అనుమానం రాకుండా... హతుడి ఇంటికి వెళ్లి ఆరా తీసిన మరో నిందితుడు.*
కైలాశ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత.. మరో నిందితుడు గణేశ్ నెల క్రితం కొరట్ పల్లి తండాకు వెళ్లి కైలాశ్ తల్లిదండ్రులను కలి శాడు. కైలాశ్ ఆచూకీ తెలిసిందా అంటూ ఆరా తీశాడు. మంగళ వా రం కువైట్లో కైలాశ్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి, తన కుమారుడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే గణేశ్ తమ గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో కైలాశ్ కుటుంబ సభ్యులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.